తెలంగాణ 'స్థానిక' ఎన్నికల్లో జనసేన పోటీ?

తెలంగాణ 'స్థానిక' ఎన్నికల్లో జనసేన పోటీ?

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. తెలంగాణలో పోటీ చేయాలని అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు.
 
పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేశామని,  స్థానిక ఎన్నికల్లో పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుందని అన్నారు. మన పార్టీకి యువత, మహిళలు బలమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని కార్యకర్తలు చెబుతున్నారని స్పష్టం చేశారు.