ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలి.. స్పష్టం చేసిన జనసేన !

ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలి.. స్పష్టం చేసిన జనసేన !

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు జన సేనచెబుతోంది. హైకోర్టు ఆదేశాలతో తన అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు అంశాలు ప్రస్తావించింది. మూడు రాజధానుల ఏర్పాటు  చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి.. రాజ్యాంగ, న్యాయపరమైన ప్రాతిపదిక లేదంటూ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలియజేసింది  జనసేన. ప్రభుత్వం చట్ట సభల సాంప్రదాయాన్ని, రూల్స్ ని అతిక్రమించి బిల్లులను ఆమోదింపచేసుకుందని తెలిపింది. రాజధాని అంశం ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత గొడవగా మారిందని అభిప్రాయపడింది. రాజధానిపై హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కీలక అంశాల తెలిపింది. 

ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రతీకారేచ్ఛతో కూడిన విధానాలను అనుమతించరాదంది జనసేన. చెడు విధానాలు, చెడు పరిపాలన.. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయన్నారు జనసేనాని. రాజకీయాలు విధానపరమైన నిర్ణయాలను శాసించ కూడదని,ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినపుడు అన్ని రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయని కోర్టుకు తెలిపారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. గతంలో అమరావతికి మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయం మార్చుకుందన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ 13 జిల్లాలను సమగ్రాభివృద్ధి చేయాలన్నది జనసేన అభిప్రాయంగా అఫిడవిట్ లో తెలిపారు.