మరోసారి పవన్‌కు షాక్..! జగన్‌ ప్రతిపాదనను సమర్థించిన ఎమ్మెల్యే రాపాక..

మరోసారి పవన్‌కు షాక్..! జగన్‌ ప్రతిపాదనను సమర్థించిన ఎమ్మెల్యే రాపాక..

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్, సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటే... మరోవైపు ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఎప్పటికప్పుడు సమర్థిస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని పవన్ తప్పుబడితే.. వాటిని సమర్థిస్తూ సీఎం వైఎస్ జగన్‌ను వెనుకోసుకొచ్చిన రాపాక.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా నడుస్తోన్న మూడు రాజధానుల వ్యవహారంలోనూ అదే చేశారు. ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాకను మీడియా ప్రతినిధులు పలకరించగా.. మూడు రాజధానుల ప్రకటనను ఆయనన సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే నన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే పెట్టి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారు. 

తాను మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతిస్తామనని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాపాక... రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సూచించారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా... ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు రాపాక. ఇక, మంచి చేస్తే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం... చెడు చేస్తే వ్యతిరేకిస్తాం మని మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు జనసేన ఎమ్మెల్యే.. కాగా, మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా తప్పుబడుతోంది జనసేన.. అమరావతి ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత.. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.