గంటలకు 400కి.మీల వేగం ఆ రైలు సొంతం!!

గంటలకు 400కి.మీల వేగం ఆ రైలు సొంతం!!

జపాన్ తన బుల్లెట్ ట్రెయిన్ ని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రెయిన్ పరీక్షలు ప్రారంభించింది. ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల (గంటకు 249 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. మూడేళ్ల క్రితం షింకన్సెన్ ట్రెయిన్ కి ఆల్ఫా-ఎక్స్ వర్షన్ అభివృద్ధి చేయడం ఆరంభించిన జపాన్, శుక్రవారం ఈ రైలుని పరీక్షించింది. 2030ల నాటికి పట్టాలక్కే ఈ రైలు, గంటకు 360కి.మీల (గంటకు 224 మైళ్లు) వేగంతో దూసుకెళ్తుంది. అదే జరిగితే ప్రపంచంలోనే ఇది అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రెయిన్ ఖ్యాతి పొందనుంది. ఆల్ఫా-ఎక్స్ గరిష్ఠ స్పీడ్ సామర్థ్యాలతోనే చైనా నిర్మించిన ఫుక్సింగ్ ట్రెయిన్ కంటే ఇది 10కి.మీలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

ఈ రైలుకి 10 కార్లు ఉండనున్నాయి. ముందు ముక్కు చాలా పొడవుగా, కోసుగా ఉండనుంది. దీనిని 280కి.మీల దూరం ఉండే సెండాయ్, ఆవ్ మోరీ నగరాల మధ్య పరీక్షించనున్నారు. ట్రాఫిక్ తక్కువగా ఉండే అర్థరాత్రి తర్వాత పరీక్షలు జరుపుతారు. వారానికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఏడాది కిందట ప్రారంభమైన జపాన్ కొత్త హైస్పీడ్ షింకన్సెన్ ఎన్700ఎస్ పరీక్షలకు కొనసాగింపుగా దీనిని పరీక్షించనున్నారు. ఆ మోడల్ 2020లో పట్టాలెక్కనుంది. కానీ దాని గరిష్ఠ వేగం ఎన్700 సిరీస్ రైళ్ల మాదిరిగా గంటకు 300కి.మీలు మాత్రమే. 

ఈ రైలు టెస్ట్ రన్ లలో ఎంత వేగం అందుకుంటుందనేది పక్కన పెడితే ఇది జపాన్ రైల్వే మేగ్నటిక్ లెవిటేషన్ లేదా మాగ్లెవ్ రికార్డుని మాత్రం బద్దలు కొట్టలేదు. 2015లో ప్రయోగాత్మక ట్రాక్ పై నిర్వహించిన పరీక్షల్లో మాగ్లెవ్ ఏకంగా గంటకు 603కి.మీల (గంటకు 374 మైళ్ల) మెరుపువేగంతో ప్రయాణించింది.