ఆటతోనే సమాధానం ఇచ్చిన బుమ్రా

ఆటతోనే సమాధానం ఇచ్చిన బుమ్రా

విమర్శించిన పోలీసులకు తన ఆటతోనే సమాధానమిచ్చాడు టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. దుబాయ్ వేదికగా తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించి విమర్శకులకు  సమాధానం ఇచ్చాడు. టీమిండియా ఏడవ సారి ఆసియాకప్‌ గెలవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా బుమ్రా గత సంవత్సరం చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్‌ చేశాడు. 'కొందరు సైన్ బోర్డుల మీద తమ సృజనాత్మకతను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. వారికి ఇదే నా సమాధానం' అని ఆసియాకప్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోను జతచేసి ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. బుమ్రా చేసిన ట్వీట్‌కు పలువురు తమ మద్దతును తెలుపుతున్నారు.

గత చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్‌ వేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. బుమ్రా నోబాల్‌ వేయడంతో పాక్‌ ఓపెనర్ ఫఖర్‌ జమాన్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఏకంగా సెంచరీ(114) చేసాడు. ఫఖర్‌ జమాన్‌ విరుచుకుపడడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష ఛేదనలో భారత్ తడబడి 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు బుమ్రా నోబాల్‌ వేసిన ఫొటోను జైపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు హోర్డింగ్‌లుగా పెట్టారు. 'లైను దాటితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అనే కాప్షన్ పెట్టి హోర్డింగ్‌లు పెట్టారు. అప్పట్లో ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. వెంటనే దీనిపై ట్విటర్‌ వేదికగా బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేసాడు.