జేడీ, విజయసాయి మధ్య మాటల యుద్ధం

జేడీ, విజయసాయి మధ్య మాటల యుద్ధం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత, మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జనసేన 88 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన విజయసాయి.. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో పోటీచేసిన జనసేన 88 చోట్ల గెలుస్తుందని లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వీటిపై జేడీ లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. 'గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, జనసేన పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి' అంటూ వ్యంగ్యంగా ట్వీట్టర్‌లో స్పందించారు. 

'మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి' అంటూ జేడీ లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.