కేంద్ర కేబినెట్‌లోకి జేడీయూ...! మ‌ళ్లీ తెర‌పైకి వైసీపీ..?

కేంద్ర కేబినెట్‌లోకి జేడీయూ...! మ‌ళ్లీ తెర‌పైకి వైసీపీ..?

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మిత్రపక్షం జేడీయూకు కేబినెట్‌లో చోటు కల్పించే దిశగా.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పుడు ఇలాంటి ప్రచారం జరిగినా.. కేంద్రంలో వైసీపీకి చోటు అనే అంశం కూడా చర్చకు వస్తోంది. ఏడాది కాలంగా ఎన్డీఏలోకి వైసీపీ అంటూ.. చాలాసార్లు వినిపించింది. సీఎం వైఎస్‌‌ జగన్‌ .. ప్రధాని మోడీతో భేటీ అయిన ప్రతిసారీ.. వైసీపీలో ఇక ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజరూపం దాల్చలేదు. కేంద్రంతో జగన్‌ సర్కార్‌ మొదట్నుంచీ మంచి సంబంధాలే సాగిస్తోంది. అందుకే, రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత కవ్వించినా, తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఇది కూడా వ్యూహంలో భాగమేనంటున్నారు విశ్లేషకులు. లోక్‌సభలో వైసీపీకి 22 మంది ఎంపీలుండగా... రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. దీంతో వైసీపీతో   అధికారికంగా చేతులు కలిపేందుకు బీజేపీ అధిష్టానం ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 

పార్లమెంటులో సంఖ్యాబలం చూసుకుంటే జగన్‌ కు బేరమాడే చాన్స్‌ బాగానే ఉంది. అయినప్పటికీ కేంద్రంతో చేతులు కలపటానికి జగన్‌ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ గెలుపు పునాదులు దళితులు, మైనార్టీ ఓట్‌ బ్యాంక్‌ పైనే ఉండడం. 2, 3 మంత్రి పదవుల కోసం తన రాజకీయ అస్థిత్వాన్ని దెబ్బతీసుకునేందుకు జగన్‌ ఇష్టపడడం లేదు. ఇక‌, రెండో కారణం కూడా బలమైందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధమని గతంలో చాలాసార్లు ప్రకటించిన జగన్‌.. ప్రత్యేక హోదా పై ఎటువంటి భరోసా లేకుండానే ఎన్డీఏలో చేరితే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. అందుకే మరోసారి బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.