బిడ్డను మరిచిపోయి విమానమెక్కిన తల్లి..

బిడ్డను మరిచిపోయి విమానమెక్కిన తల్లి..

ప్రయాణమంటేనే మనం ఎంతో జాగ్రత్తతో ఉంటాం. మనకు సంబంధించిన వస్తువులు, మనతో ఉన్న వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణిస్తుంటాం. కానీ.. ఓ తల్లి మాత్రం ఏకంగా తన కన్న బిడ్డనే మర్చిపోయి విమానమెక్కేసింది. తీరా మార్గమధ్యంలో తన బిడ్డను మరిచాననే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని లబోదిబోమంది. తన బిడ్డ తనకు కావాలంటూ కన్నీరు పెట్టుకుంది. వెయింటిగ్ హాల్‌లోనే తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కానని సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించి విమానాన్ని వెనక్కి తిప్పారు. విషయం తెలిసి వారు నివ్వెరపోయారు. మానవతా దృక్పథంతో విమానం వెనక్కి రావడానికి అనుమతిని ఇచ్చారు. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది బిడ్డను ఆమె తల్లికి అప్పగించడంతో  ఈ కథ సుఖాంతమైంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్లేందుకు బిడ్డతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్న ఆమె సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ ఎస్‌వీ 832 విమానం ఎక్కింది. మార్గమధ్యలో తన బిడ్డను విమానాశ్రయంలోనే మరిచిపోయినట్లు గుర్తించి కన్నీటిపర్యంతమైంది. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలపడంతో వారు ఏటీసీకి సమాచారం చేరవేశారు. తొలుత పైలట్ చెప్పింది ఏటీసీ ఆపరేటర్ నివ్వెరపోయాడు. అయితే, విషయం తీవ్రతను గుర్తించిన ఏటీసీ విమానాన్ని వెనక్కి మళ్లించేందుకు అంగీకరించింది. 

ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో.. విమానంలోని ఓ ప్రయాణీకురాలు తన నవజాత శిశువును ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్‌ హాల్‌లో మరిచిపోయిందని వెనక్కి రావాడానికి అనుమతినివ్వండని ఫ్లైట్‌ సిబ్బంది ఏటీసీని కోరగా... చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదని ఏటీసీ అధికారులు సంభాషించినట్లు  ఉంది.