'ఇది కేసీఆర్‌కి కనువిప్పు కలిగించే తీర్పు'

'ఇది కేసీఆర్‌కి కనువిప్పు కలిగించే తీర్పు'

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలిగించే తీర్పు వచ్చిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు జీవన్‌రెడ్డి. తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌పై 39,430 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. జీవన్‌రెడ్డి మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. మొత్తంగా జీవన్‌రెడ్డికి 56,698 ఓట్లు రాగా, చంద్రశేఖర్‌ గౌడ్‌కు 17,268 ఓట్లు, జేపీ బలపరిచిన సుగుణాకర్‌ రావుకు 15,077 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారందరూ నాకు ఓటు వేశారని తెలిపారు. ఫలితాల సరళి కేసీఆర్ అప్రజాస్వామ్య, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్న ఆయన.. 83 శాతం ఓటర్లు టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా వేశారన్నారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైందని... ఈ ఎన్నికల తీర్పు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపబోతున్నాయన్నారు. ఇప్పటి వరకు 16 ఎంపీలు చేతిలో ఉండి ఏం చక్రం తిప్పావు... రేపు ఏమి తిప్పుతావని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కి ఓట్లు, సీట్లు తప్ప పాలనపై ధ్యాసే లేదని మండిపడ్డారు. ఇస్లాం మతాన్ని కించ పరిచేవిధంగా ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిన పార్టీ బీజేపీతో కలిసి కేసీఆర్ వెళ్తున్నారని ఫైర్ అయ్యారు జీవన్‌రెడ్డి.