జెట్ సిబ్బంది జీతాలు ఇప్పట్లో రానట్టే!!

జెట్ సిబ్బంది జీతాలు ఇప్పట్లో రానట్టే!!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ వేతనాల కోసం ఎదురుచూస్తున్న తమ సంస్థ సిబ్బందికి చేదు వార్త చెప్పింది. నెలలుగా జీతాలు లేకుండా పనిచేసిన సిబ్బందికి.. సంస్ధ అమ్మకానికి సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేతన చెల్లింపులకు నిధులు సర్ధుబాటు చేయలేమని బ్యాంకుల కన్సార్షియం తెలిపినట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ వినయ్‌ దూబే ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. సిబ్బంది వేతనాలు చెల్లింపునకు కొన్ని నిధులు విడుదల చేయాలని తాము కోరగా బ్యాంకులు నిరాకరించినట్టు చెప్పారు.

కొద్ది నెలలుగా జీతాలు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే వేరే ఉద్యోగం వెతుక్కోవడం మినహా వారికి మరో మార్గం లేదని తాము పదేపదే బ్యాంకులను కోరినా ఫలితం లేకుండా పోయిందని దూబే ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తాము బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లగా దీనిపై కంపెనీ షేర్ హోల్డర్లే నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారన్నారు. బోర్డు సమావేశాల్లోనూ వేతన బకాయిల చెల్లింపునకు ప్రమోటర్లు, వ్యూహాత్మక వాటాదారును కోరినా సానుకూల స్పందన రాలేదని లేఖలో వివరించారు. 

ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక మే 10న జరిగే చివరి బిడ్డింగ్‌పైనే జెట్ ఎయిర్‌వేస్ కొండంత ఆశలు పెట్టుకుంది.