జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆగిపోనుందా?

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆగిపోనుందా?

ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. కంపెనీని ఆదుకునేందుకు విదేశీ భాగస్వాములు ముందుకు రాకపోవడంతో ఉన్న కొన్ని విమానాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. వందల సంఖ్యలో పైలెట్లు కంపెనీకి రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవాళ భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది. నరేష్‌ గోయెల్‌ బోర్డులో ఉంటే తాను కూడా ఆయనతో పాటు అదనంగా నిధులు తెస్తామని ఎతిహాద్‌ అంటోంది. దీనికి బ్యాంకులు ససేమిరా అనడంతో బోర్డు సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. మరోవైపు విమానాలు నడపడం కంపెనీకి తలనొప్పిగా మారింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో రోజుకి ఉన్న అర డజను విమానాలు కూడా తిప్పలేకపోతోంది. వీటిలో కూడా ఒకే ఒక బోయింగ్‌ విమానం ఉంది. అంతర్జాతీయ సర్వీసులను కంపెనీ ఇప్పటికే ఆపేసింది. రోజువారీ ఖర్చులకు నిధులు వస్తే గాని... విమానాలు ఎగిరే పరిస్థితి లేదు. తాజాగా మరిన్ని ఆస్తుల తాకట్టుతో పాటు తాము పెట్టే షరతులను అంగీకరిస్తేనే తాము అదనంగా నిధులు ఇస్తామని బ్యాంకులు అంటున్నాయి. ఈ విషయంలో బ్యాంకుల మధ్య కూడా విభేదాలు  తలెత్తాయి. అదనపు సొమ్ము ఇచ్చేందుకు ప్రభుత్వ బ్యాంకులు అంగీకరించినా... ప్రైవేట్‌ బ్యాంకులు అందుకు ససేమిరా అంటున్నాయి. తాత్కాలికంగా నిధులు ఇవ్వడంపై బ్యాంకులు ఏకాభిప్రాయానికి రాకపోతే కంపెనీ పూర్తిగా నిలిచిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
కేంద్రం జోక్యం...
జెట్‌ ఎయిర్‌వేస్ విషయంలో ప్రధాని కార్యాలయంతో పాటు పౌర విమానయాన సంస్థ, ఆర్థిక సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను ఆపేయడంతో పౌర విమానయాన శాఖ ఆందోళనతో ఉంది. ఎలాగైనా పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కేటాయించిన స్లాట్లను ఇతర కంపెనీలకు బదిలీ చేసేందుకు పౌర విమానయాన విభాగం ప్రయత్నిస్తోంది. ఈలోగా టికెట్లు ఇదివరకే బుక్‌ చేసుకున్నవారికి తిరిగి చెల్లింపు వ్యవహారం కూడా పెద్ద సమస్యగా మారింది. కొత్త యాజమాన్యంపై ఒక స్పష్టత రావడంతో పాటు వెంటనే నిధులు సర్దకపోతే కంపెనీ ఏ క్షణంలోనైనా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌  సంక్షోభం  ప్రత్యర్థి కంపెనీలకు వరంగా మారింది. స్టాక్‌ మార్కెట్‌లో జెట్‌ షేర్‌ దాదాపు 7 శాతం పైగా క్షీణించగా, ఇండిగో కంపెనీ షేర్‌ పది శాతం పైగా పెరిగింది. అలాగే స్పైస్‌జెట్‌ షేర్‌ కూడా గణనీయంగా పెరిగింది.