కుప్పకూలిన జెట్‌ షేర్లు

కుప్పకూలిన జెట్‌ షేర్లు

ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ ఇవాళ కుప్పకూలింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2018 ఏప్రిల్‌ 30వ తేదీన రూ. 651.40 పలికిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ ఇవాళ ఒకదశలో రూ. 158.70లకు పడిపోయింది. మొన్నటి వరకు రూ.270 ఉన్న షేర్‌ కేవలం రెండు ట్రేడింగ్‌ రోజుల్లో దాదాపు సగానికి పడిపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి వెంటనే తేరుకునే పరిస్థితి లేకపోవడంతో బుధవారం తన కార్యకలాపాలను కంపెనీ ఆపేసింది. దీంతో ఉదయం ఆరంభంలోనే షేర్‌ 10 శాతం క్షీణించింది. దీంతో కాసేపు విరామంతో మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఒకదశలో 40 శాతం దాకా క్షీణించిన ఈ షేర్‌ ఎట్టకేలకు 31 శాతం నష్టంతో రూ. 165.75 వద్ద ఇవాళ ముగిసింది. 

ఆప్షన్స్‌ జోరు..
ఏప్రిల్‌ నెలలో ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సెలవులు ఉండటంతో జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేర్‌పై డెరివేటివ్‌ (ఆప్షన్స్‌, ఫ్యూచర్స్‌) మార్కెట్‌లో ట్రేడ్‌ చేసినవారికి కంగుతిన్నారు. షేర్‌ పెరుగుతుందని ఫ్యూచర్స్‌, కాల్స్‌ కొన్న ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నష్టపోయారు. ఒక కౌంటర్‌లో నష్టాలు 2000 శాతం దాకా ఉన్నాయి. అలాగే ఈ షేర్‌ పడుతుందని ఫ్యూచర్స్‌ అమ్మిన, పుట్‌ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిసింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ రూ. 180కి పడుతుందన్న కాంట్రాక్ట్‌ విలువ రూ. 2.05. అదే కాంట్రాక్ట్‌ ఇవాళ రూ. 44.20లు పలికింది. అంటే దాదాపు 2000 శాతం పెరిగింది. ఆప్షన్ కాంట్రాక్ట్‌లో 2200 షేర్లు ఉంటాయి. అంటే రూ. 4,400 పెట్టుబడి పెట్టినవారికి ఇవాళ రూ. 88,000 వచ్చాయి. ఇదే స్థాయిలో కాల్స్‌ కొన్నవారు నష్టపోయారు. ఈస్థాయిలో మార్పులు రావడానికి కారణంగా ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌కు ఇంకా కేవలం నాలుగు ట్రేడింగ్‌ సెషన్స్‌ మాత్రమే ఉండటం మరో కారణంగా మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.