సక్సెస్ కోసం "తీన్మార్" సూత్రం

సక్సెస్ కోసం "తీన్మార్" సూత్రం

సక్సెస్ అనే ప్రేయసి చేయి అందుకునేందుకు ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. కానీ అది ఏ కొందరినో మాత్రమే వరిస్తుంది. అలా సక్సెస్ చేయందుకున్నవారి ఆనందానికి అవధులుండవు. 

స్పేస్ ఎక్స్ అనే ఏరో స్పేస్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేసిన జిమ్ కాంట్రెల్.. తన స్వీయ అనుభవంతో కొన్ని సూత్రీకరణలు చెబుతున్నాడు. అది కూడా ఎలాన్ మస్క్ ను చాలా క్లోజ్ గా చూడడం వల్లే తనకా విషయాలు బోధపడ్డాయని ఓపెన్ గా చెప్పుకున్నాడు. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే డబ్బు, ఇంటెలీజెన్స్ ఉంటేనే సరిపోదు. వాటికి తోడు ఈ మూడు ట్రిక్స్ ను కచ్చితంగా అమలు చేయాలని, అప్పుడే సక్సెస్ చాలా త్వరగా మీ ఒళ్లో వాలుతుందని కాంట్రెల్ చెబుతున్నాడు. 

1) ప్యాషన్: పని పట్ల ప్రేమ, అంకిత భావాలే ప్యాషన్ ని సూచిస్తాయి. ఇది లేకుండా మీరు పనిని ప్రేమించలేరు. పనిని ప్రేమించనివాడు సక్సెస్ ప్రేయసిని అందుకోలేడు. ఈ ప్యాషన్ వల్లే బిల్ గేట్స్ 13 ఏళ్లలో కంప్యూటర్ తో ఆటలాడుకున్నాడు. ఫలితంగా సాఫ్ట్ వేర్ రంగంలో టాపర్ ను చేసింది. 

2) ట్యాలెంట్: ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో ట్యాలెంట్ ఉంటుంది. అదే మీ సామర్థ్యం. అదే మీ బలం. ఇది వ్యక్తుల్లో సహజంగా ఉంటుంది. అదేదో గుర్తించి దాని మీదే వర్క్ చేయాలి. ఇక సులువుగా, తక్కువ టైమ్ లో చేయడాన్ని నేర్పించేది స్కిల్ ట్రెయినింగ్. ఇది నేర్చుకోవచ్చు. కానీ ట్యాలెంట్ నేర్చుకునేది కాదు. కొందరు ఏకబిగిన 7 గంటలైనా అలసిపోకుండా పని చేయగలరు. మరికొందరు గంటసేపు కన్నా ఎక్కువ కూర్చోలేరు. ఇది వ్యక్తిని బట్టి వేర్వేరుగా ఉంటుంది. అదేదో గుర్తించి దాని మీదే వర్క్ చేయాలంటున్నాడు కాంట్రెల్. 

3) వ్యాల్యూ: అద్భుతమైన ఐడియాలు ఉండొచ్చు. అయితే అవి ఎంతమందికి ఉపయోగపడతాయి.. ఎందరి అవసరాలు తీరుస్తాయి.. అనేదే వ్యాల్యూను క్రియేట్ చేస్తుంది. మీ దగ్గరుండే అద్భుతమైన ఐడియాను ఎవరూ కోరుకోకపోతే అది పనికిరాదన్నమాట. ఆ అవసరాన్ని గుర్తించింది కాబట్టే ఆన్ లైన్ మార్కెట్లో అమెజాన్ ఇప్పుడు వాల్డ్ నెంబర్ వన్ గా నిలిచింది. తొలినాళ్లలో కేవలం పుస్తకాలు మాత్రమే అమ్మవారు. ఇప్పుడు కావలసింది ఏదైనా అమెజాన్లో దొరుకుతుంది. అలా జెఫ్ బిజోస్ ఐడియా ఇప్పుడాయన్ని నెంబర్ వన్ గా నిలిపింది.