4జీ డాటా స్పీడ్ లో జియో టాప్

4జీ డాటా స్పీడ్ లో జియో టాప్

4జీ డాటా డౌన్ లోడ్ వేగంలో జియో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన తాజా రిపోర్టు ప్రకారం అన్ని ప్రముఖ ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్ల కన్నా జియో 4జీ డాటా స్పీడ్ టాప్ లో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా 6వ నెల కూడా జియో తన ఖ్యాతి నిలుపుకుంది. 

ట్రాయ్ తాజా రిపోర్టు ప్రకారం... గత ఏప్రిల్ లో 14.7 ఎంబీపీఎస్ గా ఉన్న జియో 4జీ డాటా స్పీడ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్ వరకు 20.6 ఎంబీపీఎస్ గా నమోదు చేసింది. ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కాలంలో సగటున 19.8 ఎంబీపీఎస్ గా ఉంది. అదే ఎయిర్ టెల్ సగటు 4జీ డాటా స్పీడ్ 9.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్, ఐడియా 6.5 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే డెలివరీ చేశాయి. జియోకు గట్టి పోటీదారులుగా భావిస్తున్న ఆ ముగ్గురు సర్వీస్ ప్రొవైడర్లు కనీసం 10ఎంబీపీఎస్ వేగాన్ని కూడా కస్టమర్లకు అందించలేకపోయారు. అయితే భారతి ఎయిర్ టెల్ మాత్రం ఆగస్టులో 10ఎంబీపీఎస్ వేగాన్ని అందించింది. 

ఇక 2017లో కూడా జియో 4జీ డాటా స్పీడ్ లో వరుసగా 12 నెలలు అగ్రగామిగా నిలిచింది. గతేడాది భారతి ఎయిర్ టెల్ తనదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని క్లెయిమ్ చేసుకున్న యాడ్ ను తొలగించాలని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)కు జియో ఫిర్యాదు చేసింది. దీంతో ఏఎస్సీఐ జోక్యం చేసుకొని ఆ యాడ్ ను తొలగింపజేసింది.