మోర్టార్ షెల్‌లతో కాల్పులకు తెగబడ్డ పాక్

మోర్టార్ షెల్‌లతో కాల్పులకు తెగబడ్డ పాక్

భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులతో పాక్ కు బుద్ధిరాలేదు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఫార్వర్డ్ పోస్టులపై భారీ మోర్టార్ షెల్‌లతో కాల్పులకు తెగబడింది. జమ్ము, రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లోని 55 ఫార్వర్డ్ పోస్టులు, ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారని, మూడు ఇండ్లు ధ్వంసం అయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 120 ఎంఎం మోర్టార్ షెల్‌లతో పాక్ సైన్యం దాడులకు పాల్పడిందని చెప్పారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చిందని తెలిపారు. క్రిష్ణాగాటి, బాలాకోట్, ఖారీ కర్మరా, మాన్‌కోట్, టర్కుండి (పూంచ్ జిల్లా), కలాల్, బాబా ఖోరి, కల్సియాన్, లామ్, ఝంగర్ (రాజౌరి), పల్లన్‌వాలా, లలెయలీ(జమ్ము) ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నట్లు వివరించారు. అంఖూర్ సెక్టార్‌లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మి తెలిపింది. మంగళవారంతో వరుసగా నాలుగు రోజులు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మరోవైపు భారత్ వైమానిక దాడులు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. దాడుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, వైమానిక దళ అధిపతి బీఎస్ ధనోవా భేటీ అయ్యారు. భారత్ చర్యకు ప్రతీకారంగా పాక్ దాడులకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. నియంత్రణ రేఖ వెంట, అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న వైమానిక సిబ్బంది, సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.