వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు డుమినీ గుడ్ బై

వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు డుమినీ గుడ్ బై

ఇంగ్లాండ్ లో మే 30న ప్రారంభమయ్యే 2019 ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమినీ వన్డేలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని డుమినీ శుక్రవారం ప్రకటించాడు. అయితే టీ20 ఫార్మాట్ లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. 'కొన్ని నెలలుగా ఆటకు దూరం కావడంతో నాకు నా కెరీర్ ఎటు వెళ్తోందో ఓ అంచనాకు వచ్చే అవకాశం దక్కింది. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను గుర్తించి వాటిని ఎలా సాధించాలో గుర్తించగలిగానని' డుమినీ ఒక ప్రకటనలో చెప్పాడు.

తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్టు అతను తెలిపాడు. 'ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ తేలిక కాదు. మరొకరికి స్థానం కల్పించేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. దేశీయ, అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడేందుకు నేను అందుబాటులో ఉంటాను. పెరుగుతున్న నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నాను. అది నా తొలి ప్రాధాన్యత' అన్నాడు.

తన సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 'నేనెంతో ప్రేమించే ఆటను ఆడాలన్న నా కలను సాకారం చేసుకోగలిగిన అదృష్టం దక్కింది. ఇన్నేళ్లు ఆడేందుకు సహకరించిన నా జట్టు సహచరులు, శిక్షకులు, కుటుంబం, స్నేహితులు, అభిమానులకు రుణపడి ఉంటాను.' అని పేర్కొన్నాడు.

టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్టు సెప్టెంబర్ 2017లో డుమినీ ప్రకటించాడు. 46 టెస్టులాడిన ఆల్ రౌండర్ 32.85 సగటుతో 2,103 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రోటీస్ తరఫున 193 వన్డేలు ఆడాడు. వన్డేలలో 37.39 సగటుతో 5,407 పరుగులు చేశాడు. 68 వికెట్లు కూడా తీశాడు. దక్షిణాఫ్రికా జట్టు తరఫున 2011, 2015 వరల్డ్ కప్ లలో ఆడాడు. ఇప్పుడు చివరగా మూడో వరల్డ్ కప్ ఆడనున్నాడు. 

ఇటీవలే మరో వెటరన్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కూడా ఇంగ్లాండ్ లో జరగబోయే టోర్నమెంట్ తో 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించాడు.