బీజేపీకి కొత్త చీఫ్... ఆయన ఎన్నిక ఏకగ్రీవమే..!

బీజేపీకి కొత్త చీఫ్... ఆయన ఎన్నిక ఏకగ్రీవమే..!

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే. అయితే పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీ ఎన్నికల నిర్వహణ ఇన్‌ఛార్జి రాధామోహన్ సింగ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేశారు. తొలుత బూత్, మండల, జిల్లా, 21 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ఇప్పటికే పూర్తైంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అధ్యక్షుల ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఇవాళ మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు...బీజేపీ ముఖ్య నేతలు హాజరవుతారు. 

జాతీయ అధ్యక్ష పదవి కోసం ఇవాళ నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు  నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక  నిర్వహిస్తారు. అయితే, పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా మినహా ఇతర నాయకులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. జేపీ నడ్డా ఇవాళ ఉదయం 10 గంటలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రస్తుత అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నడ్డా నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత నడ్డా పార్టీ జాతీయ అధ్యక్ష  పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాధామోహన్ సింగ్ ప్రకటిస్తారు. ఈ సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నడ్డా అభినందన సభ జరిగే అవకాశాలున్నాయి.