సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లలేదంటే..

సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లలేదంటే..

రాఫెల్ డీల్ లో కుంభకోణం జరిగిందని కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు స్కామ్ పై తాము ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదో కాంగ్రెస్ పార్టీ వివరించింది. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ లో అవినీతిపై విచారణ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని భావించే తాము కేసు వేయలేదని కాంగ్రెస్ ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇవాళ సుప్రీం తీర్పు కూడా తమ వాదనను బలపరిచేలా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం ఈ వ్యవహారంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ దర్యాప్తునకు అంగీకరించాలని సవాల్ విసిరారు.

రాఫెల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయించలేదని కొన్ని నెలల ముందు నుంచి తాము చెబుతున్నామని రణ్ దీప్ సూర్జేవాలా అన్నారు. ఈ రక్షణ కాంట్రాక్ట్ లో అవినీతిని కాంట్రాక్టుకు సంబంధించిన ఫైళ్లు, ఇతర పత్రాలను పరిశీలించిన తర్వాత జేపీసీ మాత్రమే నిర్ణయించ గలదని చెప్పారు. అందువల్ల జేపీసీ ఒక్కటి మాత్రమే దర్యాప్తులో భాగంగా ధరల ప్రక్రియను, సావరిన్ గ్యారంటీని పరిశీలించి రాఫెల్ కాంట్రాక్ట్ లో అవినీతిని బయట పెట్టగలదని తెలిపారు. ‘వాళ్లు ఏదీ దాచాలనుకోకపోతే మోడీ, ఆయన ప్రభుత్వం జేపీసీ దర్యాప్తునకు అంగీకరించాలని సవాల్ చేస్తున్నాను. జేపీసీ ఈ రక్షణ ఒప్పందంలో అవినీతిపై ప్రశ్నించి నిజాలను వెలికి తీస్తుందని’ అన్నారు. అధికారంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారి కనుసన్నలలో ఈ అవినీతి జరిగిందని సూర్జేవాలా ఆరోపించారు. సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఏకపక్షమైన, అర్థసత్యాలను అందజేసిందని, వాటిని ఎవరూ పరిశీలించలేదని గుర్తు చేశారు.