27న గోకుల్ చాట్ పేలుళ్లపై తుది తీర్పు

27న గోకుల్ చాట్ పేలుళ్లపై తుది తీర్పు

గోకుల్‌చాట్‌, లుంబిని పార్క్ పేలుళ్ల కేసుల విచారణ పూర్తయింది. 11 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ నెల 27న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. భద్రత కారణాలరీత్యా చర్లపల్లి సెంట్రల్‌ జైలులోనే తీర్పును ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తీర్పుపై హైదరాబాద్‌ నగర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

2007, ఆగస్టు 25న రాత్రి 7.45 గంటలకు మొదట లుంబిని పార్క్‌లో, ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 42 మంది చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. జంట పేలుళ్ల కేసు దర్యాప్తును కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెల్‌, ఎన్‌ఐఏ అధికారులు చేపట్టారు. దాదాపు 11 ఏళ్లు కొనసాగిన ఈ కేసు దర్యాప్తులో మొత్తం 170 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. 

ఈ కేసులో నిందితులైన అనీఖ్ సయ్యద్‌(ఏ1), మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌(ఏ2)ను 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు తామే జరిపినట్టు వారు అంగీకరించారు. ఇతర నిందితులుగా రియాజ్‌ భత్కల్‌(ఏ3), ఇక్బాల్‌ భత్కల్‌(ఏ4), ఫరూఖ్‌ షర్ఫుద్దీన్‌(ఏ5), మహ్మద్‌ సిద్ధి షేక్‌(ఏ6), అమీర్‌ రసూల్‌ ఖాన్‌(ఏ7) ఉన్నారు. వీరిలో రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌, ఫరూఖ్‌ పరారీలో ఉన్నారు. షఫీక్ సయ్యద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్, మహ్మద్ సిద్ధిక్, అన్సార్ అహ్మద్ జైలులో ఉన్నారు.