సీజేఐ కేసు: జస్టిస్ ఎన్ వి రమణ స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రా

సీజేఐ కేసు: జస్టిస్ ఎన్ వి రమణ స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రా

సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ ఇందు మల్హోత్రాను చేర్చారు. ఇవాళ ప్యానెల్ నుంచి వైదొలగిన జస్టిస్ ఎన్ వి రమణ స్థానంలో ఆమె వచ్చారు. జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ కుటుంబ స్నేహితుడు అయినందువల్ల ఆయన సభ్యుడుగా ఉందరాదని ఫిర్యాదీ మహిళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ ఎన్ వి రమణ ఈ ఉదయం కమిటీ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో అంతర్గత దర్యాప్తు ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

'ప్యానెల్ లో మెజార్టీ పురుషులు ఉంటే తన అఫిడవిట్, సాక్ష్యాలకు తగిన ప్రాధాన్యత, న్యాయబద్ధమైన విచారణ జరుగుతాయనే నమ్మకం లేదని' ఫిర్యాదీ మహిళ సుప్రీంకోర్ట్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్యానెల్ లో ఎక్కువ మంది మహిళా జడ్జిలు ఉండాలని కోరారు.

జస్టిస్ ఆర్ భానుమతి తర్వాత సుప్రీంకోర్టులో రెండో మహిళా జడ్జి అయిన జస్టిస్ ఇందు మల్హోత్రా గత ఏడాది ఏప్రిల్ లో వచ్చారు. దేశంలోని పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల కేసుల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు తయారుచేసిన విశాఖ కమిటీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు.