'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌... సీజేఐ కీలక వ్యాఖ్యలు...!

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌... సీజేఐ కీలక వ్యాఖ్యలు...!

హైదరాబాద్‌ శివారులో జరిగిన దిశపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ప్రముఖులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.. ఆ తర్వాత ఈ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంపై కూడా పెద్ద చర్చ, రచ్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే... రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో కలిసి నూతన హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయం ఎన్నటికీ ప్రతీకారంగా మారకూడదని.. ఒకవేళ అలా మారితే దాని సహజ గుణాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఇక, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఘటనలు పాత చర్చలను మళ్లీ సరికొత్తగా తెరమీదికి తీసుకొచ్చాయన్న ఆయన.. ఒక కేసు పరిష్కారానికి తీసుకుంటున్న సమయం, అనుసరిస్తున్న మార్గాన్ని సమీక్షిస్తూ నేర న్యాయవ్యవస్థను మరింత కఠినం చేయాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు.

దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌పై చర్చ జరుగుతోన్న సమయంలో.. దీనిపై పరోక్షంగా సీజేఐ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయం ఉంది. ఇక ఎస్‌ఏ బోబ్డే ఏం మాట్లాడారో చూస్తే.. 'ఎలాంటి విచారణ జరుపకుండా తక్షణ న్యాయం ఎప్పటికీ సాధ్యం కాదని.. న్యాయం ఎన్నటికీ ప్రతీకారంగా మారకూడదని.. ఒకవేళ అలా మార్పు చెందితే న్యాయం తన సహజ గుణాన్ని, విలువను కోల్పోతుందని తెలిపారు. న్యాయవ్యవస్థ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఆయన.. వివాదాలకు వేగవంతమైన, సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాల్లో ప్రయత్నించడంతోపాటు, కొత్తవాటిని అభివృద్ధి చేయాల్సి అవసరం మాత్రం ఉందన్నారు. అదే సమయంలో న్యాయవ్యవస్థలో కలుగుతున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు చీఫ్ జస్టిస్.. న్యాయవ్యవస్థలో స్వీయ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ ఆయన.. అయితే, వీటిపై బహిరంగంగా చర్చించాలా? వద్దా? అనేదే పెద్ద ప్రశ్నగా పేర్కొన్నారు.