సింధుశర్మ వద్దకు చేరిన చిన్నకుమార్తె

సింధుశర్మ వద్దకు చేరిన చిన్నకుమార్తె

జస్టిస్ నూతి రామ్మోహన్ కోడలు సింధూ శర్మ చేస్తున్న పోరాటంలో చివరికి విజయం సాధించింది. భర్త, అత్త మామలు చిన్న కుమార్తెను సింధు శర్మకు అప్పగించారు. ఆదివారం ఉదయం నుంచి  రామ్మోహన్‌రావు ఇంటి బయట సింధూ శర్మ సహా ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సాయంత్రం చిన్నపాప శ్రీవిద్యను తల్లి సింధూ శర్మకు పోలీసులు అప్పగించారు. పెద్ద కుమార్తె రిషిక అప్పగింతపై చర్చలు కొనసాగుతున్నాయి. మూడున్నరేళ్ల పెద్ద కుమార్తెను కూడా అప్పగించే వరకూ వెళ్లేది లేదని సింధూ తేల్చి చెబుతోంది. పెద్దపాపకు అన్ని విషయాలూ తెలుసని, తనపై ఎలా దాడి చేశారో ఆమెకు పూర్తిగా తెలుసని సింధూ ప్రకటించారు. అన్ని విషయాలు బయటపెడుతుందనే పెద్ద పాపను తనకు అప్పగించడం లేదని, తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. పెద్ద పాపను తనకు అప్పగించకపోతే తాను కోర్టుకు వెళ్తానని సింధు స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు భరోసా సెంటర్‌లో పెద్ద కుమార్తెను కూడా అప్పగించే అవకాశం ఉందని సింధు తెలిపారు. పరస్ఫర ఆమోదంతో విడాకులు తీసుకోవాలని జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు తనకు సూచించారన్నారు. అయితే వారిపై తాను వేసిన కేసులు ముందు రుజువవ్వాలని, అప్పటి వరకూ విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని సింధు తేల్చి చెప్పారు. కలిసి ఉండేందుకు భర్త వశిష్ట ముందుకొస్తే తాను ఒక అవకాశమిస్తానని సింధూ శర్మ వ్యాఖ్యానించారు.