జస్టిస్ బోబ్డేతో అనుబంధాన్ని మరచిపోలేను : ఎన్వీ రమణ

జస్టిస్ బోబ్డేతో అనుబంధాన్ని మరచిపోలేను : ఎన్వీ రమణ

సీజేఐ జస్టిస్ బాబ్డే వీడ్కోలు సమావేశం ఈరోజు జరిగింది. ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ జస్టిస్ బోబ్డేతో అనుబంధాన్ని మరచిపోలేనన్న ఆయన జస్టిస్ బాబ్డే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఆకట్టుకున్నాయని అన్నారు. జస్టిస్ బోబ్డేకు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఆలానే  ‘వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.. ఆయనకు విభిన్న అభిరుచులు ఉన్నాయని, దీంతో పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనే దానిపై ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు. భవిష్యత్‌ లో ఆయన చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు.  జస్టిస్ బాబ్డే ఈ-కోర్టులు ప్రారంభించారని,  కరోనా వేళ జస్టిస్ బోబ్డే మౌలిక వసతులు కల్పించారని అన్నారు. దేశమంతా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది, కరోనా మహమ్మారితో పోరాడుతున్నామని రమణ పేర్కొన్నారు.  బలమైన చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని సూచించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణతోనే మహమ్మారిని ఓడించగలమని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. వైరస్‌కు ఎలాంటి బేధభావాలూ లేవని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.