న్యాయవాదులకు జస్టిస్‌ రమణ కీలక సూచన

న్యాయవాదులకు జస్టిస్‌ రమణ కీలక సూచన

ఏపీ ప్రజల ముంగిటకే న్యాయ పాలన వచ్చిందని.. యువ న్యాయవాదులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సూచించారు. అమరావతిలో ఇవాళ హైకోర్టు భవన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ఛాలెంజింగ్‌గా తీసుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్ట్ ఎదగాలని ఆకాంక్షించారు. జనవరి 25 నాటికి అమరావతిలోని సిటీ సివిల్ కోర్టు భవనం పూర్తి కావస్తోందని.. ప్రారంభోత్సవానికి వచ్చేందుకు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అంగీకరించారని చెప్పారు.

మాతృభూమికి, సొంత ప్రజలకు సేవ చేసేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు వచ్చారని జస్టిస్‌ రమణ అన్నారు. 62 ఏళ్ల తర్వాత ఏపీ నుంచే న్యాయ పాలన సాగబోతోందన్న ఆయన.. 62 ఏళ్ల క్రితం అప్పటి ఏపీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు చెప్పిన మాటలు అనుసరణీయమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను గౌరవించుకోవాలని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో న్యాయ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తోందని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు.