సైనా-గోపీచంద్ వివాదం...అంతా తెలుసంటున్న జ్వాల

సైనా-గోపీచంద్ వివాదం...అంతా తెలుసంటున్న జ్వాల

ఒక్క పుస్తకం వందలకొద్దీ సందేహాలను రేకెత్తిస్తోంది. పాత గాయాలను మళ్లీ గుర్తుకు తెస్తోంది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తను రాసిన పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. 'డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్' పేరిట రాసిన పుస్తకంలో 2014లో సైనా తన బ్యాడ్మింటన్ అకాడమీని వీడటంపై అనుమానాలు వ్యక్తం చేశారు గోపి. లెజెండరీ ప్లేయర్, నటి దీపికా పదుకొణె తండ్రి ప్రకాశ్ పదుకొణె దీనికి కారణమని గోపీ వెల్లడించారు. తన పుస్తకంలోని బిట్టర్ రైవలరీ చాప్టర్‌లో ఈ అంశం గురించి వివరించారు.

ఆ సమయంలో సైనా తన అకాడమీ విడిచి వెళ్లిపోవడంపై బాధ పడ్డారట గోపీ. ప్రియమైన వస్తువును తన దగ్గర నుంచి తీసుకెళ్లినంత బాధపడినట్టు తెలిపారు. అకాడమీని వదిలి వెళ్లకూడదని దాదాపుగా అర్ధించినట్టు తన పుస్తకంలో రాసుకొచ్చారు గోపి. అయితే అప్పటికే కొందరి మాటలు విన్న సైనా నిర్ణయం తీసుకుందని వివరించారాయన. ఆ సమయంలో తనకంటే ఎక్కువగా పీవీ సింధుపైనే గోపీ ఫోకస్ పెట్టడంతో సైనా అలా చేశానని పలుమార్లు చెప్పుకుంది. 2012-14 మధ్యలో సింధు భాగా ఆడిందని, సైనాతో పాటు సింధు తదితర ప్లేయర్లపై దృష్టి పెట్టినట్లు గోపీ వ్యాఖ్యానించారు. ప్రకాశ్, కోచ్ విమల్ కుమార్, హాకీ ప్లేయర్ వీరేన్ రస్కిన్హా  తన గురించి చెడుగా చెప్పి ఉంటారని గోపీ అనుమానించారు.

ప్రకాశ్‌‌ను తను రోల్ మోడల్‌గా భావిస్తానన్న గోపీ తన గురించి సైనాకు ఒక్క సానుకూలాంశం కూడా ప్రకాశ్ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 తర్వాత సైనా ఆటతీరు గాడి తప్పింది. రియో ఒలింపిక్స్ ప్రారంభ రౌండ్‌లోనే ఆమె వెనుదిరగడంతో పాటు గాయాలతో వెనుకంజ వేసింది. ఇది సైనా కెరీర్‌లోనే చెత్త దశ అని సైనా భర్త పారుపల్లి కశ్యప్ తెలిపారు. అనంతర కాలంలో గోపీకి సారీ చెప్పాలని భావించిన సైనా ఆ పని చేయలేకపోయిందని తెలిపారు. అయితే గోపీచంద్‌ అకాడమీని వీడాలన్న నిర్ణయం సైనా నెహ్వాల్‌ స్వయంగా తీసుకుందని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ తెలిపింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యమేమీ లేదని స్పష్టం చేసింది. అయితే ఈలోపు గోపీచంద్‌, షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగానే స్పందించారు. 1999 జాతీయ శిబిరంలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న ఇదే వ్యక్తి. హైదరాబాద్‌ను వదలి ప్రకాశ్‌ పదుకొణె అకాడమీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు.