టీమిండియా రేసులో విశాఖ కుర్రాడు

టీమిండియా రేసులో విశాఖ కుర్రాడు

ఎంఎస్‌ ధోనీ వారసుడిగా రిషభ్‌ పంత్‌ సత్తా చాటుతున్నా మరికొంతమంది యువ వికెట్‌ కీపర్లు ఈ స్థానంపై కన్నేశారు. ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న కేరళ క్రికెటర్‌ సంజూ శాంసన్‌, రంజీల్లో రెచ్చిపోతున్న ఇషాన్‌ కిషాన్‌లు జాతీయ జట్టులో స్థానంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పంత్‌, శాంసన్‌, కిషాన్‌లలో ఒకరు ధోనీకి ప్రత్యామ్నాయం అని రెండు మూడేళ్లుగా అనేక మంది చెబుతూ వస్తున్నారు. ఐతే.. వీరికి పోటీగా దూసుకొచ్చడు మన విశాఖ కుర్రాడు కేఎస్‌ భరత్‌. 

ఇటీవల 'ఎ' సిరీస్‌లకు వరుసగా ఎంపికవుతున్న 23 ఏళ్ల భరత్.. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాడు. గత 12 నెలల్లో ఇండియా-ఎ తరఫున 11 అనధికార టెస్టులు ఆడిన భరత్‌..‌‌‌ 686 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2  హాఫ్‌‌‌‌ సెంచరీలున్నాయి. కీపర్‌‌‌‌గా 41 క్యాచులందుకున్న భరత్‌‌‌‌.. 6 స్టంపింగ్స్‌‌‌‌ కూడా చేశాడు. మరో ముఖ్యవిషయమేంటంటే.. కీపర్‌ రేసులో పంత్‌ తర్వాతి ప్లేస్‌లో వృద్ధిమాన్‌ సాహాతోపాటు కేఎస్‌ భరత్‌ ఉన్నారని ఇవాళ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే భరత్‌కు టీమిండియాలో చోటు దక్కి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

విశాఖకు చెందిన భరత్  2015 ఫిబ్రవరిలో రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించడంతో ఐపీఎల్‌లోనూ అవకాశం దక్కింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు భరత్‌ను రూ.10 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.