పాపం కేఏ పాల్..!

పాపం కేఏ పాల్..!

సార్వత్రిక ఎన్నికల్లో సంచలనం సృష్టించబోతున్నామంటూ మీడియాలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఎన్నికల సమయంలో పాల్ ఏం చేసినా అది వైరల్‌గా మారిపోయింది. అది ఆయనకు ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చిపెట్టకపోదా? అనే చర్చ సాగింది. కానీ, ఇవేవీ ఆయనకు ఓట్ల వర్షం కురిపించలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి రాష్ట్రంలో ఒక్కచోటా  డిపాజిట్టు దక్కపోగా... ఎక్కడా చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు... అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఎక్కడా 300కు మించి ఓట్లు రాలేదు. ఇక పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన కేఏ పాల్‌కు వచ్చింది 281 ఓట్లు మాత్రమే. ఇక నర్సాపురం లోక్‌సభ స్థానంలో ఆయనకు 2987 ఓట్లు దక్కాయి. ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలీకాఫ్టర్‌ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్‌ గుర్తును పోలి ఉందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయటంతో కొత్త చర్చజరగగా... మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన అభ్యర్థులే ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. నామినేషన్ వేసినా.. ప్రచారం చేసినా.. చివరకు ఓటు వేసినా.. తన చేష్టలతో వార్తల్లో నిలిచిన కేఏ పాల్... చివరకు ఓడిపోయి కూడా వార్తల్లో నిలిచారు.