మూవీ రివ్యూ : 'కాలా'

మూవీ రివ్యూ : 'కాలా'

నటీనటులు : రజనీకాంత్, నానా పాటేకర్, ఈశ్వరీరావు, హుమా ఖురేషి, అంజలీ పాటిల్, సముద్రఖని, షాయాజీ షిండే తదితరులు 

ఛాయాగ్రహణం : మురళి జి

సంగీతం : సంతోష్ నారాయణన్ 

దర్శకత్వం : పా రంజిత్ 

 

నిర్మాత : ధనుష్  

 

విడుదల తేదీ : 07 జూన్ 2018

 

రజనీకాంత్ పేరే ఓ బ్రాండ్. ఆయన సినిమాలకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే... 'కబాలి' తరవాత మరోసారి పా రంజిత్ ప్రతిభ మీద ఆయన నమ్మకం పెట్టుకోవడం ప్రేక్షకులకు చిన్నపాటి షాక్. 'కబాలి'లో రజనీ మేనరిజమ్స్ తప్ప ఇంకేమీ లేవు. అభిమానుల అంచనాలను చేరుకోలేకపోయింది. దానికి తోడు 'కాలా'లో రజనీ గెటప్, సినిమా సెటప్ వేరయినా ప్రచార చిత్రాల్లో కథంతా 'కబాలి'ని గుర్తుకు తేవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై సందేహాలు మొదలయ్యాయి. సందేహాలను పటా పంచలు చేస్తూ సినిమా కొత్తగా ఉందా? 'కబాలి'ని గుర్తు చేసిందా? రివ్యూ చదవండి. 

 

కథ :

ముంబైలోని ధారవి ప్రజలకు 'కాలా' సేఠ్ అలియాస్ కరికాల (రజనీకాంత్) మాటే వేదవాక్కు. ధారవి మురికివాడలోని ప్రజల సంక్షేమం కోసం కాలా ప్రతిక్షణం పరితపిస్తాడు. అక్కడి మురికివాడల్లో ప్రజలను ఖాళీ చేయించి భారీ భవంతులు కట్టించి వాళ్లకు ఇస్తామని, ముంబైని ప్యూర్ సిటీగా చేస్తానని హరిదాదా (నానా పాటేకర్) చెబుతుంటాడు. హరిదాదా పనులకు కాలా అడ్డు తగులుతుంటాడు. ప్రజలను మోసం చేసి, వాళ్ల భూమిని లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోనని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తాడు. ప్రభుత్వం అండతో హరిదాదా ఏం చేశాడు? అతడిని కాలా ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతను కోల్పోయింది ఏమిటి? మధ్యలో జరీనా (హుమా ఖురేషి) ఎవరు? ఆమె పాత్ర ఏంటి? అనేది సినిమా. 

 

నటీనటుల పనితీరు :

రజనీకాంత్‌లోని నటుడిని, ఆయన హీరోయిజాన్ని దర్శకుడు రంజిత్ సరిగ్గా చూపించలేకపోయాడేమో అనే అభిప్రాయం కలుగుతోంది. ఫ్లైఓవర్ ఫైట్, పోలీస్ స్టేషన్ సీన్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ వంటి కొన్ని సన్నివేశాల్లో రజనీ హీరోయిజాన్ని చూపించాడు. మిగతా సినిమా అంతా రజనీ పక్కనున్న ఆర్టిస్టులు ఓవర్ చేశారు. రజనీ, నానా పటేకర్ మధ్య సన్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా నానా పటేకర్ తెరపై కనిపించినంత సేపూ ఆయన నటనతో మెస్మరైజ్ చేశారు. కళ్లతో విలనిజాన్ని చూపించారు. హుమా ఖురేషి కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు. పాత్రకు తగ్గట్టు చేశారు. ఈశ్వరీ రావు, అంజలీ పాటిల్, సముద్రఖని.. తదితరులంతా ఓవర్ యాక్టింగ్ చేశారని అనడం కంటే వాళ్లతో దర్శకుడు చేయించాడని చెప్పడం సబబుగా వుంటుందేమో.     

 

సంగీతం - సాంకేతిక వర్గం : 

సంతోష్ నారాయణన్ పాటల్లో ఒక్కటీ గుర్తు పెట్టుకునేట్టు లేవు. ముఖ్యంగా ప్రతి పాటలో ర్యాప్ మ్యూజిక్, లిరిక్స్ ఎందుకు ఇరికించవలసి వచ్చిందో అర్థం కాదు. ఏడుపు పాటల్లోనూ ర్యాప్ పెట్టిన ఘటన సంతోష్ నారాయణన్, పా రంజిత్‌ల‌కు మాత్రమే దక్కుతుంది. ముఖ్యంగా రజనీ, హుమా ఖురేషి మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం, 'చిట్టమ్మా...' పాట ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ద్వితీయార్థంలో, రజనీ హీరోయిజమ్ చూపించే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు. తెలుగు డైలాగులు చికాకు తెప్పించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.   

 

దర్శకత్వం : 

పా రంజిత్ కథల్లో, సినిమాల్లో, దర్శకత్వంలో దళితులపై ప్రేమ కనిపిస్తుంటుంది. అయితే... ఆయన చూపించిన కథ కొత్తది కాకపోవడమే సినిమాకి మైనస్. కమల్ హాసన్ 'నాయకుడు' నుంచి జూనియర్ ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా' వరకూ ముంబై నేపథ్యంలో ఇటువంటి కథలు ఎన్నో వచ్చాయి. సినిమాలో చర్చించిన భూమి కాన్సెప్ట్ పక్కన పెడితే... సన్నివేశాల్లోనూ కొత్తదనం లేదు. 'కబాలి' గుర్తుకు వస్తుంది. రజనీని ఉత్సవ విగ్రహంలా మార్చి చుట్టుపక్కల వారితో ఎక్కువ యాక్టింగ్ చేయించాడు రంజిత్. ప్రథమార్థంలో రొమాంటిక్ ట్రాక్ సాగదీశాడు. ద్వితీయార్థంలోనూ కొంత తడబడ్డాడు.  

 

విశ్లేషణ :

రజనీకాంత్ సినిమా అంటే ఆయన హీరోయిజం చూడాలని ఎక్కువమంది ఆశ పడతారు. కథ ఎలా ఉన్నా... రజనీ మార్క్ డైలాగులు, పది నిమిషాలకు ఒకసారి ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు పడితే చాలు. ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. వాళ్లకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు రంజిత్. ఎంతసేపూ రజనీ పక్కన నటించి పాత్రల చేత ఓవర్ యాక్టింగ్ చేయించాడు. వాళ్ళ ముఖాలు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవి కాకపోవడం ఒక మైనస్ అయితే... సినిమాలో తమిళ వాసన ఎక్కువ కావడం మరో మైనస్. ఈ రెండిటి కంటే ఎక్కువ నటీనటులు మాట్లాడే యాస మరింత చికాకు పెడుతుంది. మురికివాడల్లో ప్రజలు ఆ యాస మాత్రమే మాట్లాడతారని దర్శకుడికి ఎవరు చెప్పారో? చాలా ఇబ్బందిగా అనిపించింది.  ఎంతసేపూ కష్టాలు చెప్పడం తప్ప... పరిష్కారం చూపించే సన్నివేశం ఒక్కటీ సినిమాలో లేదు. ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని చూడకుండా, అందరూ కలిసి ఐకమత్యంతో పోరాడాలని సినిమాలో సందేశం ఇచ్చాడు. 'మురికివాడల్లో ప్రజలను ఖాళీ చేయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందువల్ల చాలామంది నిరాశ్రయులు అవుతున్నారు' అని దర్శకుడు రంజిత్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. కానీ, ఆయన చెప్పిన విధానం ఆకట్టుకునేలా లేదు.