బాలిక కిడ్నాప్...మళ్ళీ రంగంలోకి ధర్మాడి సత్యం టీమ్ 

 బాలిక కిడ్నాప్...మళ్ళీ రంగంలోకి ధర్మాడి సత్యం టీమ్ 


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తి శ్రీ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బాలిక కిడ్నాప్ అయి రెండు రోజులు కావొస్తున్నా ఇంతవరకూ ఆచూకీ లభించలేదు. దీప్తిశ్రీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. బాలిక సవతితల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంద్రపాలెం లాకుల దగ్గర ఉప్పుటేరులోకి దీప్తి శ్రీని తోసేశానని సవతి తల్లి శాంతకుమారి చెప్పడంతో గాలింపు బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. గాలింపు చర్యల కోసం ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది. జగన్నాథ పురం వెంతన నుంచి ఇంద్రపాలెం లాకుల వరకు ఒక బృందం, వంతెన నుంచి న్యూ పోర్ట్ వరకు మరో బృందం గాలింపు నిర్వహిస్తోంది. శాంతకుమారి పొంతనలేని సమాధానాలు ఇస్తోందని పోలీసులు అంటున్నారు.

దీప్తి శ్రీని చంపేశానని ఒకసారి, వేరే వాళ్లకు ఇచ్చేశానని ఒకసారి చెబుతోందని తెలిపారు. పగడాల పేటకు చెందిన దీప్తిశ్రీ నేతాజీ మున్సిపల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నానమ్మ ఇంటి నుంచి స్కూలుకు బయలుదేరి వెళ్లింది. సాయంత్రం దాటినా కూతురు ఇంటికి రాకపోవడంతో తండ్రి సత్యశ్యామ్ కుమార్ అనేక చోట్ల వెతికారు. బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో కాకినాడ వన్‌ టౌన్  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ పాఠశాలకు వచ్చి బాలికను వెంట తీసుకెళ్లి కొంత దూరం తర్వాత ఓ బైక్‌పై ఎక్కి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.