కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటుచేస్తున్నారు. కనిష్ఠంగా 2.66 మెగావాట్లు మొ దలు 26, 40, 106.. ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న.. బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. 

ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదలచేసిన నీటితో నందిమేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌లో మంగళవారం రాత్రి సమయానికి 142.30 మీటర్ల మేర నింపారు. సోమవారం రాత్రి మొదటి మోటరుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ట్యూబ్ గేట్‌ను ఎత్తిన అధికారులు.. మంగళవారం రాత్రి రెండో మోటరు డ్రాఫ్ట్‌ట్యూబ్ గేటును కూడా ఎత్తారు. బుధవారం ఉదయం వెట్ రన్ ల్రో భాగంగా మొదటి మోటరును ఆన్‌చేయగానే పంపులు డిజైన్‌స్థాయి వేగానికి (ఆర్పీఎం- రెవల్యూషన్స్ పర్ మినిట్) తిరుగుతున్నయా? అనే అంశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మోటరులోని ఇంపుల్లర్‌లోకి నీటిని పంపేందుకుగాను బట్టర్‌ ఫ్లె వాల్వ్ తెరుచుకుంటుంది. దీంతో ఇంపుల్లర్ వేగంగా తిరుగడంతో అందులోకి చేరిన నీటిని ఎత్తిపోస్తుంది.