కాళేశ్వరం ప్రారంభం నేడే..
నీళ్లు.. నిధులు.. నియామకాలు.. అంటూ సాగిన పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది... ఇక తెలంగాణ ప్రజల ‘జల-ఆశయం’ నెరవేరే రోజు కూడా వచ్చేసింది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. నీటి కోసం పరితపిస్తున్న బీడు భూముల దాహార్తి తీర్చే మహోన్నత ఘట్టానికి రంగం సిద్ధమైంది. వివిధ దశల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ ఉదయం గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఇరత ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 10.30కి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి రుణాలిచ్చిన వివిధ బ్యాంకులకు చెందిన 13 మంది మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. ఇక, ఆ తర్వాత గవర్నర్, మహారాష్ట్ర, ఏపీ సీఎంలతోపాటు రాష్ట్ర మంత్రులు వివిధ బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవాన్ని ఓ పండుగలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)