స్పీడ్‌పెంచిన నందమూరి హీరో.. ఈసారి మూడు పాత్రల్లో..

స్పీడ్‌పెంచిన నందమూరి హీరో.. ఈసారి మూడు పాత్రల్లో..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అందరికీ సుపరిచితమే. వరుస ప్లాప్‌లను ఎదుర్కున్నా కూడా చిత్ర సీమలో అతడికంటూ ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇదివరకు పటాస్, 118 వంటి కొత్త తరహా కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హిట్ అందుకోలేదు. చివరిగా కళ్యాణ్ చేసిన ఎంత మంచివాడవురా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దాంతో ప్రస్తుతం కళ్యాణ్‌కు తప్పక హిట్ కొట్టాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగా కళ్యాణ్ రామ్ కొందరు దర్శకుల కథలను వింటున్నాడట. తన నెక్స్ట్ సినిమాల విషయంలో కళ్యాణ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే చివరికి రాజేంద్ర అనే కొత్త దర్శకుడి అవకాశం ఇవ్వనున్నాడట. అతడి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఇంతకు ముందు హరే రామ్ సినిమాలో కళ్యాణ్ రెండు పాత్రల్లో చేశాడు. కానీ మూడు పాత్రలు చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి చూపుతుందట. అంతేకాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందట. సినిమాకు కావలసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపికలో ఉన్నారట. దీంతో పాటుగా కళ్యాణ్ రామ్ డైరెక్టర్ వేణు మల్లిడి స్టోరీకి కూడా పచ్చజెండా ఊపాడట. దీనికి తుగ్లక్ అనే పేరు ప్రచారంలో ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఏది నిజమనేది చెప్పలేము. అయితే ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్.. ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమాకు సహ నిర్మాతగా వ్యవమరించనున్నాడు. ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కనుందట.