రజనీని వెనకేసుకొచ్చిన కమల్

రజనీని వెనకేసుకొచ్చిన కమల్

గత వారం తమిళ రాజకీయాల మీద రజినీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘రాష్ట్రంలో సరైన నాయకుడు లేడు. అధికార, ప్రతిపక్షాల వల్ల రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి’ అని వ్యాఖ్యానించి కలకలం రేపింది. దీని మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లపై నిప్పులు చెరిగిన ఆయన కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ అజ్ఞానులు అంటూ మండిపడ్డారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్‌ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎడపాడి చేసిన వ్యాఖ్యలపై శివాజీ అభిమాన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇతరుల కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది.  కమల్‌ హాసన్, రజనీ కాంత్ అభిమానులు కూడా సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదంటూ తిట్టిపోశారు. అయితే ఈ విషయం మీద తమిళనాడు అధికార పార్టీపై విలక్షణ నటుడు, మక్కళ్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందన్న రజినీకాంత్‌ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.

తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇక్కడ నాయత్వం లోపించింది. గతంలో మంచి నాయకులు ఉండేవారు. వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కానీ, ఇప్పుడు అలాంటి నేతలు కరవయ్యారు. గతంలో రజినీకాంత్‌ కూడా ఇవే మాటలన్నారు. కానీ, ఆయన చెప్పిన సత్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి జీర్ణించుకోలేకపోయారు. సూపర్‌ స్టార్‌ మాటల్లో నాకెక్కడా తప్పు కనిపించలేదని కమల్‌ అన్నారు. గత వారం రజినీ ఓ కార్యక్రమంలో పాల్గొని ‘రాష్ట్రంలో సరైన నాయకుడు లేడు. అధికార, ప్రతిపక్షాల వల్ల రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మాటలను తాజాగా కమల్‌ సమర్థించారు.