పట్టణ ప్రాంతాలలో అదరగొట్టిన కమల్ పార్టీ

పట్టణ ప్రాంతాలలో అదరగొట్టిన కమల్ పార్టీ

విశ్వ నాయకుడు కమల్ హాసన్ మక్కళ్ నీది మెయ్యమ్ (ఎంఎన్ఎం) ఆరంగేట్రంలోనే అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో సీట్లేవీ గెలవకపోయినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. చాలా నియోజకవర్గాలలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు దడ పుట్టించింది. తమిళనాడులోని 12 నియోజకవర్గాలు, పుదుచ్చేరిలలో మూడో స్థానం సాధించగలిగింది. 

లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కమల్ హాసన్ 'మా అభ్యర్థులు రేపటి విజేతలని' ప్రకటించారు. 'రాజకీయాల్లో నిరాశనిస్పృహలకు తావు లేదని. తాము ఇప్పుడు కేవలం 14 నెలల పసిపాపలమని, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతామని' చెప్పారు. ఎంఎన్ఎంకి ఓటు వేసిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 'మమ్మల్ని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా గుర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి. కానీ మేం మా ఉనికి చాటుకున్నాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాం. ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం మంచిదైందని' కమల్ అభిప్రాయపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగ్గా రాణిస్తామని చెప్పారు. 

హోరాహోరీగా సాగిన పోరులో ఎంఎన్ఎం ఏఐఏడిఎంకె, డీఎంకెలకు గట్టి పోటీ ఇచ్చింది. మొట్టమొదటిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ చాలా నగర, పట్టణ ప్రాంత నియోజకవర్గాలలో ఎంఎన్ఎం మూడో స్థానంలో నిలిచింది. చెన్నై సెంట్రల్, చెన్నై నార్త్, చెన్నై సౌత్ నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు 10 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించారు. కోయంబత్తూరు అభ్యర్థి ఆర్ మహేంద్రన్, దక్షిణ చెన్నై అభ్యర్థి ఆర్ రంగరాజన్ చెరో లక్షకు పైగా ఓట్లు పొందారు. పారిశ్రామిక, వ్యాపార నగరాలుగా పేరొందిన కోయంబత్తూరు తిరుప్పూరు, శ్రీపెరంబుదూర్, తిరువళ్లూరులలో పార్టీ మూడో స్థానంలో ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు.