'రాజధాని భూములతో వ్యాపారం'

'రాజధాని భూములతో వ్యాపారం'

రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా భూరక్షణ దీక్ష చేపట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ప్రజల భూములను అధికార పార్టీ నాయకులు దోపిడీ చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఇవాళ విజయవాడలో భూ రక్షణ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ రాజధాని భూములతో వ్యాపారం చేస్తున్నారని.. రాజధానిలో జరిగిన భూ కుంభకోణం ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నారు. బ్రిటీష్ వాళ్లు గతంలో ఏవిధంగా దేశ ప్రజలను హింసించారో.. టీడీపీ నేతలు అంతకుమించి రాజధాని రైతులను హింసిస్తున్నారని ఆరోపించారు. 

అమరావతి భూములను సీయం బంధువులు, నాయకులు కొనుగోలు చేసిన తర్వాతే రాజధాని ప్రాంతంగా ప్రకటించారని.. సీఎం తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉన్నదని కన్నా అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉన్నదని అన్నారు. సీఎంకు ధనదాహం, భూదాహం పట్టుకుందని.. విశాఖపట్నం భూకుంభకోణంలో వేల కోట్ల దోపిడి జరిగిందని స్వయంగా వారి మంత్రే  చెప్పారని కన్నా గుర్తు చేశారు.