టీమిండియా కోచ్‌ రేసులో ఫైనల్‌గా మిగిలింది వీరే..

టీమిండియా కోచ్‌ రేసులో ఫైనల్‌గా మిగిలింది వీరే..

టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి... బీసీసీఐ ప్రకటనతో తామే టీమిండియాకు దిశానిర్ధేశం చేయగలమనే విశ్వాసంతో దాదాపు 2 వేల మంది వరకు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన ఆటగాళ్లు.. తాము ప్రాతినిధ్యం వహించిన జట్లకు తిరిగులేని విజయాలు సాధించిపెట్టినవాళ్లు కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నవారే. అయితే, ఈ రేస్‌లో ఫైనల్‌గా మిగిలింది మాత్రం ఆరుగురే..! ఆ ఆరుగురికి ఈ నెల 16వ తేదీ నుంచి కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 

ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఫైనల్‌గా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కపిల్‌ కమిటీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇప్పటికే దరఖాస్తుదారులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఇక ఇంటర్వ్యూ కోసం ముంబై రాలేనివాళ్లతో స్కైప్‌ ద్వారా కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. మరోవైపు రవిశాస్త్రిని కొనసాగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదరవ్వడం ఖాయం అంటున్నారు. ఇక, కపిల్‌ కమిటీ హెడ్ కోచ్‌ పదవికి మాత్రమే ఇంటర్వ్యూలు చేయనుంది.. సహాయ కోచ్‌లు, ఇతర సిబ్బంది కోసం ఇంటర్వ్యూల్ని క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చేయనున్నట్టు తెలుస్తోంది.