కపిల్‌దేవ్‌కు కీలక బాధ్యతలు..?

కపిల్‌దేవ్‌కు కీలక బాధ్యతలు..?

వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ప్రక్షాళనకు సిద్ధమైన బీసీసీఐ.. కోచింగ్‌ స్టాఫ్‌పై దృష్టి పెట్టింది. హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితోపాటు అతని టీమ్‌ టైమ్‌ ముగిసినా 45 రోజులు పొడిగించిన బీసీసీఐ.. ఈ గ్యాప్‌లో కొత్త కోచ్‌లను ఎంపిక చేయబోతోంది. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన బోర్డు.. పలు నియమనిబంధనలకు అనుగుణంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. ఐతే.. హెచ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యతలను కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని అడ్‌హక్‌ కమిటీకి అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.

సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా సంఘం కొనసాగింపుపై త్వరలోనే సుప్రీం కోర్టు ఆదేశాలివ్వనుంది. విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల వ్యవహారంలో వీరి ముగ్గురికీ మినహాయింపు లభించని పక్షంలో కపిల్‌దేవ్‌ కమిటీకే కోచ్‌ను ఎంపిక చేసే అవకాశం లభిస్తుంద. ఈ అడ్‌హక్‌ కమిటీలో కపిల్‌దేవ్‌తోపాటు అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. భారత మహిళల జట్టు కోచ్‌గా రామన్‌ను ఎంపిక చేసింది ఈ కమిటీయే.