బీజేపీపై ప్రకాష్‌ కారత్‌ సంచలన ఆరోపణలు

బీజేపీపై ప్రకాష్‌ కారత్‌ సంచలన ఆరోపణలు

డబ్బులతో ప్రతిపక్షాల సభ్యులను బీజేపీ కొనుగోలు చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌కారత్‌ అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను డబ్బుతోనే బీజేపీ కొనుగోలు చేసిందన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలు బీజేపీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చాయన్న కారత్‌.. గత ఎన్నికల్లో బీజేపీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే 16 మంది కోటీశ్వరులయ్యారని అన్నారాయన.
'బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను కేవలం ఎన్నికల ద్వారా ఎదుర్కోలేం. సైద్ధాంతికంగా పోరాటం చేయాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే లౌకిక తత్వానికి మద్దతివ్వాలి. హిందూ మతానికి ప్రమాదమంటూ  బీజేపీ హిందువులను కూడగట్టి రాజకీయం చేస్తోంది' అని అన్నారు కారత్‌. తమది లౌకికవాద పార్టీ అని చెప్పే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. గత ఎన్నికల్లో గుళ్లూ గోపురాలు తిరిగారని విమర్శించారు.