విశ్వాస పరీక్షపై ఉత్కంఠ.. కష్టాల్లో సంకీర్ణం..!

విశ్వాస పరీక్షపై ఉత్కంఠ.. కష్టాల్లో సంకీర్ణం..!

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ విశ్వాస పరీక్షపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. ఇంతకీ ఇవాళ విశ్వాస పరీక్ష జరుగుతుందా? వాయిదా వేస్తారా? అనే విషయంపై కూడా గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధ రామయ్య.. తమ ఎమ్మెల్యేలు తమ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నందున విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కర్ణాటక సర్కారుకు చెమటలు పుట్టిస్తోంది. సభకు రావాల్సిందిగా అసంతృప్త ఎమ్మెల్యేలను బలవంతం చేయలేరు.. అని సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఆదేశం కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కారుకు సంకటంగా మారింది. ‘అనర్హత వేటు’తో ఎమ్యెల్యేలను దారికి తెచ్చుకునే అవకాశాలు మూసుకుపోయాయి. దీంతో గురువారం జరిగే బల పరీక్ష ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

అసెంబ్లీలో మెజార్టీని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ప్రయత్నాలు తీవ్రం చేసినా.. 16 మంది అసంతృప్తుల్లో మాజీ మంత్రి రామలింగారెడ్డి ఒక్కరే శాంతించినట్టు తెలుస్తోంది. మిగతా 15 మంది ముంబైలోనే మకాం వేశారు. ఇక ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరైన వారిలో సగానికి పైగా సర్కార్‌కు అనుకూలంగా ఓటువేస్తేనే ప్రభుత్వం గట్టెక్కుతుంది. ఇదే సమయంలో స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది.. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్పీకర్‌కే వదిలేయడం... కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందుగా నిర్ణయించినట్టు ఇవాళే ఫ్లోర్ టెస్ట్ ఉంటుందా? లేదా వాయిదా వేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.