అర్ధరాత్రి వరకు హైడ్రామా.. బలపరీక్షకు టైం ఫిక్స్..

అర్ధరాత్రి వరకు హైడ్రామా.. బలపరీక్షకు టైం ఫిక్స్..

కర్ణాటక రాజకీయం ఇంకా ఉత్కంఠ రేపుతూనే ఉంది... రాత్రి 9 గంటల వరకు బలపరీక్షపై కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమార్ డెడ్‌లైన్ పెట్టడం ఆసక్తికరంగా మారగా.. అసెంబ్లీ తీవ్ర ఉత్కంఠ మధ్య రాత్రి 11.40 గంటల వరకు సాగింది. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. అయితే, బలపరీక్షపై ఓటింగ్‌కు టైం ఫిక్స్ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓటింగ్‌ నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. దీంతో నాలుగోరోజు కూడా విధానసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన విధానసభ రాత్రి 11.40 గంటల వరకు జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ నిర్వహిస్తామని స్పీకర్‌ రమేష్‌కుమార్‌ ప్రకటించడంతో ఉత్కంఠ మధ్య సభ వాయిదా పడింది. 

మరోవైపు, ఇప్పటికే రెండుసార్లు విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించారు సీఎం కుమారస్వామి.. అయితే, కొంత కోర్టు తీర్పుతో ముడిపడి ఉన్నందున ఆయన ముందడుగు వేయలేకపోయారు. మొదట సోమవారమే ఓటింగ్‌ నిర్వహిస్తానని స్పీకర్‌ రమేష్‌కుమార్‌ ప్రకటించడం.. మరికొంత సమయం కావాలని సీఎం కోరడం.. ఇవాళ్లే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు పట్టుబట్టడం లాంటి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పరీక్షను సోమవారమే ముగించాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అర్జీతో పాటు విప్‌పై స్పష్టత కోరుతూ కాంగ్రెస్‌ నేతల విన్నపాలపై సుప్రీంకోర్టు స్పందిస్తూ వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని ప్రకటించింది. గవర్నర్‌ ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై కూడా ఇదే విధంగా తీర్పునిచ్చింది. ఇదే సాకుతో పాలకపక్ష సభ్యులు ఓటింగ్‌కు ససేమిరా అంటూ చర్చలకే పరిమితమయ్యారు. ఇక, విప్‌ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గత గురువారం సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన అభ్యంతరానికి స్పీకర్‌ సోమవారం రూలింగ్‌ ఇచ్చారు. సరిగ్గా ఇదే అంశాన్ని అడ్డు పెట్టుకున్న పాలకపక్షాలు ఈ రూలింగ్‌కు ప్రాధాన్యమివ్వాలంటే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా సభకు హాజరుకావాలని పట్టుబట్టారు. మరోవైపు విశ్వాస తీర్మాన చర్చలో పాలకపక్ష సభ్యులు సుదీర్ఘంగా ప్రసంగిస్తుండటంతో సభను స్పీకర్‌ రెండు సార్లు వాయిదా వేశారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఓ దశలో పాలకపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో సాయంత్రం ఆరింటి తర్వాత రెండున్నర గంటల పాటు సభ వాయిదా పడింది. మళ్లీ రాత్రి 8:30 గంటలకు మొదలైన సభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు విప్‌ అధికారం పార్టీలకు ఉందంటూ స్పీకర్‌ రూలింగ్‌ ఇవ్వటంతో ముంబైలో మకాం వేసిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. వారు మంగళవారం సభకు హాజరు కావాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు నోటీసులిచ్చాయి. మరో వైపు రాజీనామాపై విచారణకు కూడా మంగళవారం హాజరుకావాలని 15మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ కూడా కర్ణాటక రాజకీయ పరిణామాలు ఉత్కంఠగానే కొనసాగనున్నాయి.