కొత్త రూల్స్ పెట్టిన కర్ణాటక సీఎం...

కొత్త రూల్స్ పెట్టిన కర్ణాటక సీఎం...

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే... హెచ్ డీ కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వ అధికారులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, సమాచార మార్పిడికి అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఆదేశాల ప్రకారం సమావేశాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని నిర్దేశించారు సీఎస్ కె.రత్నప్రభ... సీఎం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. కీలకమైన సమావేశాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించకపోవడమే మంచిదన్నారు. 

స్కూల్ టైంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధాన్ని విధిస్తూ త్వరలోనే ఒక సర్క్యూలర్ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్లాసులు జరిగే సమయంలోనూ మొబైల్ ఫోన్లు ఉపయోగించే ఉపాధ్యాయులు, సిబ్బందిని గుర్తించాం... అందుకే స్కూళ్లలో మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. స్కూల్ వర్కింగ్ టైంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించినట్లయితే, స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తప్పవంటున్నారు. బాధ్యతలు స్వీకరించిన 10 రోజుల్లోనే పాలనపై తన పట్టు నిలుపుకోవాలి, తన ప్రత్యేకతను చాటుకోవాలని కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడటం లేదు సీఎం కుమారస్వామి.