సిద్ధు ట్వీట్లకు జనం ఫిదా!

సిద్ధు ట్వీట్లకు జనం ఫిదా!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... ట్విట్టర్‌ వేదికగా వేసే పొలిటికల్ సెటైర్లు ఇప్పుడు చర్చనీయాశంగా మారిపోయాయి. ప్రత్యర్థులు ఏదైనా కామెంట్ చేస్తే వెనువెంటనే సిద్ధరామయ్య ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చే కౌంటర్ పదునైన మాటలతో ఆ కామెంట్‌ చేసిన నేతను డైలమాలో పడేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక సిద్ధు ట్వీట్లకు జనం ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సిద్ధరామయ్య వేస్తున్న కౌంటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ... ఒక సీఎం ట్విట్టర్ ఖాతా ఎంతో మందిని ఆకర్షించడం కూడా ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు.

కర్నాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కాంగ్రెస్‌ది 2+1 ఫార్ములా అంటూ ఆరోపించారు. సీఎం సిద్ధరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తే... ఆయన కుమారుడు ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నారని... ఇదే కాంగ్రెస్‌లో రాజకీయ వారసత్వమంటూ కామెంట్ చేస్తే... ఇక అంతే స్పీడుగా ట్వీట్ చేశారు సిద్ధరామయ్య... అవును కర్నాటకలో బీజేపీది 2+1 ఫార్ములానే ఇద్దరు రెడ్డీలు, ఒక యెడ్డీ అంటూ... గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు.... యడ్యూరప్ప గురించి సెటైర్లు వేశారాయన. ఇక రాహుల్ గాంధీ పేపర్ చూడకుండా 15 నిమిషాలు మాట్లాడగలరా? అనే ప్రశ్నకు కూడా ఘాటుగా బదులిచ్చారు సిద్ధు... యడ్యూరప్ప, కర్నాటకకు ఏం చేశారో మీరు 15 నిమిషాల పాటు పేపర్ చూసే చెప్పాలంటూ సవాల్ విసిరారు. అంతే దీంతో నెటిజన్లు సిద్ధూ కామెంట్లను తెగ మెచ్చుకుంటున్నారు. మోదీపై సిద్దూ సూటిగా బాణాలు వేస్తున్నారంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇలా ప్రత్యర్థులు ఎలాంటి కామెంట్ చేసినా... అంతే స్పీడ్‌గా కామెంట్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సిద్ధరామయ్య. కర్నాటక సీఎం ట్విట్టర్ ఖాతా నుంచి ఎవరు ట్వీట్ చేస్తున్నారో కానీ, భలేగా ఉంటున్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.