కర్ణాటకలో మరోసారి తిరుగుబాటు..! సీఎం యడ్యూరప్పకు పదవీగండం..?

కర్ణాటకలో మరోసారి తిరుగుబాటు..! సీఎం యడ్యూరప్పకు పదవీగండం..?

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఎం పదవి చేపట్టడానికి సిర్వ ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు యడ్యూరప్ప.. దీంతో.. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. కుమారస్వామి సీఎం అయ్యారు.. అయితే, అప్పటి నుంచి ఆ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీ.. చివరకు అనుకున్నది చేసింది.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు యడ్యూరప్ప.. కానీ, కర్ణాటక రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచారు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ... ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి సీఎం యడ్యూరప్పకు పదవి గడ్డం తప్పదా? అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ఇవాళ బెళగావి జిల్లాలో మీడియాతో మాట్లాడిన బసవనగౌడ.. యడ్యూరప్ప పదవిపై బాంబు పేల్చారు. మే 2 తర్వాత ఏ క్షణంలో అయినా యడ్యూరప్ప సీఎం పదవి నుంచి దిగిపోకతప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు.. ఈ నెల 17 తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హీట్ పెంచారు.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కొంతమంది చెబుతున్నారన్న ఆయన.. అసలు అది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.. 2023 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారా? 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ఆయనకు వర్తించదా..? అని ప్రశ్నించారు. యడ్యూరప్ప.. సీఎం పదవిలో కొనసాగడం అదృష్టంగా భావించాలని.. పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతగా ఏప్రిల్ 17వ తేదీ తర్వాత స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించారు. ఆ తర్వాత సీఎం పీఠం కచ్చితంగా మారుతుందన్నారు.