కర్ణాటక ఎఫెక్ట్: గోవా, బీహార్‌లలో రచ్చ రచ్చ

కర్ణాటక ఎఫెక్ట్: గోవా, బీహార్‌లలో రచ్చ రచ్చ

ఊహించినట్లుగానే కర్ణాటక ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా కన్నడ నాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు..? గవర్నర్ అతిపెద్ద పార్టీని పిలుస్తారా..? లేక కూటమి లెక్కల్లో బలంగా ఉన్న జేడీఎస్-కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తారా అంటూ సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ వాజుభాయ్ వాలా కోరడంతో.. యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే గోవా, బీహార్‌లలో నాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీలను కాదని.. ఆయా రాష్ట్రాల గవర్నర్లు బీజేపీకి పట్టం కట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కింది. నాడు తమ గోడు ఎవరూ వెళ్లబోసుకోలేదని.. కానీ అప్పుడు తమకు ఎదురైన అనుభవమే బీజేపీకి ఇప్పుడు ఎదురైనప్పటికీ.. గవర్నర్‌ తమ వాడే కావడంతో కన్నడనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటూ కాంగ్రెస్, ఆర్జేడీలు మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గోవా, బీహార్‌లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అవకాశం ఇవ్వాల్సిందిగా గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ చెల్లా కుమార్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలవనున్నారు... అటు బీహార్‌లో ఆర్జేడీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఇది ఈ రెండు రాష్ట్రాలతో ఆగదని మణిపూర్, మేఘాలయాల్లోనూ ఇదే తరహా రాజకీయం నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.