బహుళ అంతస్థుల భవన నిర్మాణంపై నిషేధం?!

బహుళ అంతస్థుల భవన నిర్మాణంపై నిషేధం?!

రోజురోజుకీ రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిపోతున్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం వివిధ పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఐదేళ్లపాటు బహుళ అంతస్థుల గృహ సముదాయాల నిర్మాణంపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి పరమేశ్వర ప్రకటించారు. అపార్ట్ మెంట్లు నిర్మించిన బిల్డర్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి నీటి సదుపాయం కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. నీటి లభ్యతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే బిల్డర్లు అపార్ట్ మెంట్లు అమ్మేస్తున్నారని ఆయన అన్నారు. 

నీటి వనరులు ఎండిపోయినపుడు అపార్ట్ మెంట్లలో నివసిస్తున్నవారు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి కారణంగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు, చర్మరోగాల బారిన పడుతున్నారని పరమేశ్వర వివరించారు. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బెంగుళూరు మహానగరంలో రాబోయే ఐదేళ్ల పాటు అపార్ట్ మెంట్ల నిర్మాణంపై నిషేధం విధించే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే దీనిపై బిల్డర్లు, డెవలపర్లు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తెలుసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అపార్ట్ మెంట్లకు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బృహత్ బెంగుళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులను ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కావేరీ ఐదో దశ నీటి సరఫరా ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయన్న పరమేశ్వర, దానితో కూడా నగర నీటి అవసరాలు తీరవని చెప్పారు. అందువల్ల బెంగుళూరుకి 400 కి.మీల దూరంలో కోస్తా ప్రాంతంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న లింగనమక్కి డ్యామ్ నుంచి నీటి తరలింపుపై డీపీఆర్ తయారుచేయాల్సిందిగా అధికారులకు సూచించినట్టు వివరించారు.