అమ్మవారి ప్రసాదం తిని భక్తురాలు మృతి

అమ్మవారి ప్రసాదం తిని భక్తురాలు మృతి

కర్ణాటకలో ఘోరం జరిగింది. అమ్మవారి ప్రసాదం తిని ఓ మహిళ చనిపోగా, 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత డిసెంబర్‌లో చామరాజ్‌నగర్ జిల్లాలో ప్రసాదం తిని 17 మంది చనిపోయిన ఘటన మర్చిపోకముందే... తిరిగి అటువంటి ఘటన పునరావృతం కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలోని చిక్ బళ్లాపుర జిల్లా చింతామణిలోని గంగమ్మ ఆలయం వద్ద శుక్రవారం రాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేసిన ప్రసాదం తిని 28 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరో 9 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసాదం తిన్న వెంటనే అందరికీ కడుపులో విపరీతమైన నొప్పి మొదలైందని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గుడి బయట పంపిణీ చేసిన ప్రసాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని గంగమ్మ దేవి ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానిత మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేవుడి ప్రసాదం పేరుతో ఈ ముగ్గురు మహిళలు కేసరి భట్ (హల్వా) పంచిపెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని ఇద్దరు మహిళలు గంగమ్మ ఆలయం ముందు భక్తులకు ప్రసాదం పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.