నేడే కర్ణాటక పోలింగ్‌

నేడే కర్ణాటక పోలింగ్‌

నేడే కర్ణాటక సమరం. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌లలో ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతాడో తేలే రోజు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. వాయిదా పడిన ఆర్‌ఆర్‌ నగర్, జయనగర మినహా 222 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. సుమారు  55,600 పోలింగ్‌ బూత్‌ల్లో, 4.96 కోట్ల ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. వారి నిర్ణయం ఏమిటన్నది 15వ తేదీన ఓట్ల లెక్కింపుతో తేలిపోనున్నది. కర్ణాటకలోనే కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేసేవిగా చెబుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. దిగ్గజ నేతలు రంగంలోకి దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఇక్కడ అధికారం చేపడితే బీజేపీ జాతీయ స్థాయిలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లోనూ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ  ఓటమిపాలైతే జాతీయ స్థాయిలో ఆ పార్టీ పట్టు సడలిపోతుందని నిపుణలు విశ్లేషణ. కనీసం 130 స్థానాల్లో గెలుపు తమదేనని కమలం పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇక.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఓడిపోతూ వచ్చింది.

ఇటువంటి తరుణంలో కర్ణాటకలో కూడా ఓడిపోతే అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వం ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రాహుల్‌ పట్టు పెరుగుతుంది. '2019లోనేనే ప్రధానిని' అని రాహుల్‌ ప్రకటించుకున్న నేపథ్యంలో ఇక్కడ ఓడిపోతే అప్రతిష్ఠపాటు కాక తప్పదు.  మరోవైపు జేడీఎస్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఆ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తుందో లేక కింగ్‌మేకర్‌గా అవతరిస్తుందో చూడాల్సి ఉంది.