'జూరాల'కు కృష్ణమ్మ పరుగులు

'జూరాల'కు కృష్ణమ్మ పరుగులు

జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. మరో 48 గంటల్లో జూరాల పూర్తిస్థాయి నీటితో కళకళలాడనుంది. నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక 9,870 క్యూసెక్కుల నీటిని నిన్న విడుదల చేసింది. ఈ నీరు ఇవాళ సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌ నుంచి విడుదలైన నీరు గూగల్‌ బ్యారేజీ, గుర్జాపూర్‌ బ్యారేజీ దాటి నీరు 180 కిలోమీటర్లు ప్రవహించి జూరాలకు చేరుకుంటుంది.  

పాలమూరు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం కారణంగా జూరాలకు నీరు విడుదలైంది. జూరాలకు ఒకటిన్నర టీఎంసీ నీరు వచ్చినా ఈ వేసవి ఎద్దడిని అరికట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిషన్‌ భగీరథ, జములమ్మ రిజర్వాయర్‌తోపాటు 6 నియోజకవర్గాల పరిధిలోని మంచి నీటి పథకాలకు జూరాల నీరు అందనుంది.