ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్యేల రాజీనామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్... కర్ణాటకలో క్షణం క్షణం ఉత్కంఠరేపుతోన్న రాజకీయ పరిస్థితులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... పార్టీలను బట్టి చట్టాలు మారవు.. పార్టీలు ఉంటాయి పోతాయి.. చివరి వరకు చట్టాన్ని కాపాడేందుకే నా ప్రతయ్నం అన్నారాయన. ఇక దేశంలో రాజకీయ వ్యవస్థ వ్యాపారమయం అయ్యిందన్న ఆయన.. బ్యాంక్ పాస్ పుస్తకాలు చూసి టికెట్లు ఇస్తున్నారు.. దాంతో రియల్టర్లు, వ్యాపారులు రాజకీయాల్లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం నాకు లేదంటూ కుండబద్దలు కొట్టిన స్పీకర్ రమేష్ కుమార్... ప్రజల ఓట్లతో గెలిచిన ఓ ఎమ్మెల్యే.. హోటల్ మకాం వేసి.. పోలీసుల రక్షణలో వచ్చి రాజీనామా లేఖ ఇస్తే.. అది సహజంగా చేసిన రాజీనామా అని ఎలా ఒప్పుకోవాలి? అంటూ ఫైర్ అయ్యారు. 

నేను అందుబాటులో లేకపోతే మైనార్టీలో పడిపోయిన కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు పారిపోయారని వ్యాఖ్యానించడం ఎంత వరకు సరైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ రమేష్ కుమార్. నియోజకవర్గాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలకు ముంబైలోని హోటల్‌లో ఏంపని అని ప్రశ్నించిన ఆయన.. వాళ్లు రాజీనామా చేయడానికి వస్తారని నాకు ముందే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడడానికి చివరి వరకు నా ప్రయత్నం కొనసాగుతుందని.. నా ముందు ఇంత జరుగుతుంటే.. సహజంగా చేసిన రాజీనామాలు అని ఎలా అనుకోవాలని మండిపడ్డారు. నాకు సంతృప్తికరమైన సమాధానం వస్తేనే రాజీనామాలు ఆమోదిస్తానని స్పష్టం చేసిన స్పీకర్ రమేష్ కుమార్.. నేను తలవంచేది రాష్ట్ర ప్రజలకు.. చట్టానికేనని వెల్లడించారు.