హుజూర్‌నగర్ టికెట్ నాకే ఇవ్వాలి..!

హుజూర్‌నగర్ టికెట్ నాకే ఇవ్వాలి..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్రమైన చర్చకు తెరలేపుతోంది... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ నేతల మధ్య భినాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... తాజాగా, టీఆర్ఎస్ అభ్యర్థి వ్యవహారంపై తెరపైకి వచ్చింది.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ను తనకే ఇవ్వాలని తెలంగాణ మలిదశ పోరాట అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆమె.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తాను హుజూర్‌నగర్‌ నుంచి బరిలోకి ఓటమిపాలైన తర్వాత.. ఐదేళ్ల పాటు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా సేవలు అందించానని.. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సైదిరెడ్డికి టికెట్‌ కేటాయించినప్పుడు సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం నడుకున్నానని తెలిపారు. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని కోరారు శంకరమ్మ. అంతేకాదు.. తనకు కేటాయిస్తే.. ఏకగ్రీవంగా అవకాశం ఉందని.. బీజేపీ చీఫ్ అమిత్‌షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తాను ఏకగ్రీవంగా ఎన్నికైయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. అయితే, మరోవైపు సీఎం కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తే తనకు అభ్యంతరం లేదని.. కవిత గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు శంకరమ్మ. కాగా, గత ఎన్నికల్లో హుజూర్‌నగర్ స్థానం నుంచి పోటీచేసేందుకు చివరి వరకు శంకరమ్మ తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే.